కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా గురువారం ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు ఈ ఇద్దరు. రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం పై ప్రత్యేకంగా ప్రస్తావించారు. మామునూరు ప్రతిపాదిత విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయ్యిందన్నారు. కావున వెంటనే పనులు చేపట్టాలని కోరారు కేంద్ర మంత్రిని.
కొత్తగూడెం ప్రతిపాదిత విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించామని, OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్గాం ప్రతిపాదిత విమానాశ్రయానికి ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు. ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.





