టీటీడీ పరిధిలోని ఆలయాలన్నీ కిటకిట
తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ మహా శివ రాత్రి సందర్బంగా భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా లోని శ్రీ కాళహస్తి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలలో భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రతా, ట్రాఫిక్, సౌకర్యాల ఏర్పాట్లను జిల్లా పోలీస్ శాఖ సమగ్రంగా అమలు చేసిందన్నారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ వ్యవస్థ, అత్యవసర సేవల సిద్ధత తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కపిల తీర్థంలో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణతో కలిసి సమీక్షించారు. భక్తుల దర్శనాల విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహణ జరుగుతోందని చెప్పారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ. క్యూలైన్లు క్రమబద్ధంగా నిర్వహించ బడుతున్నాయని తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఎటువంటి తొక్కిసలాట లేదా గందరగోళ పరిస్థితులు లేకుండా దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు ఎల్. సుబ్బారాయుడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని అన్నారు. ప్రధాన ఆలయాలు, ఉప ఆలయాలు, జలపాతాల ప్రాంతాలలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.





