Friday, 16 October 2026

శ్రీ కపిలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

newsseals-MahaShivaratri

భక్తజనోహం మధ్య భోగితేరు ఊరేగింపు

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. పెద్దసంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వ‌హించారు.

ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీసోమస్కంద మూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *