పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే

VijayaBhaskar · February 26, 2026
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చారు. పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేద‌ని అన్నారు. పొరుగు రాష్ట్రం దీనిపై అభ్యంతరాలను తెలియ చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను మాత్రమే తరలించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని స్ప‌ష్టం చేశారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. దీనికి తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

గత పాలనలో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోతే వాటిని పెట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని.. పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకు పోయినా దానిని గుర్తించలేని పరిస్థితి సీఎం ఎద్దేవా చేశారు. తాను చేయని తప్పు కు అరెస్టు చేసిన తనను 53 రోజుల పాటు జైల్లో పెట్టారని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకూ నీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. నీటి భద్రతను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ ఇంటికీ సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చేలా సంకల్పంతో పని చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.