ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లను కొత్తగా ఉద్యాన పంటల కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 2026-27లో రూ.200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కొబ్బరి ప్రాసెసింగ్ పార్క్‌ను అమలాపురంలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. 2025-26లో 20.01% OERతో మెట్రిక్ టన్నుకు రూ.20,680 ధర రైతులకు లభించిందన్నారు.
2026-27లో 35,000 హెక్టార్ల కొత్త విస్తరణ లక్ష్యంతో రూ.204 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు అచ్చెన్నాయుడు. ఉద్యానశాఖకు 2026-27 సంవత్సరానికి రూ.1,123.86 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించామన్నారు. రైతుల ఆదాయం పెంపుతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని శక్తివంతం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2024-25లో 1.18 లక్షల హెక్టార్లు, 2025-26లో ఇప్పటివరకు 1.05 లక్షల హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అందించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. 2026-27లో 1.50 లక్షల హెక్టార్ల లక్ష్యంతో పాటు రూ.475 కోట్లతో సూక్ష్మసేద్యానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు.





