హరీశ్ రావుపై ఆకునూరి మురళి ఆగ్రహం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు, కల్వకుంట్ల కుటుంబానికి , మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు లేదని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. గత పది సంవత్సరాల మీ పాలనా కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఏదో ఉద్దరించామని మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. తాము సమర్పించిన కమిషన్ రిపోర్ట్ మీరు మొదటి పేజీ కూడా చదవకుండానే మాట్లాడితే ఎలా అని హరీశ్ రావును ఉద్దేశించి ప్రశ్నించచారు. అందుకే అందులో ఉన్న విషయాల మీద రాయకుండా మా టీం విద్యార్హతల మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమేంటి అని మండిపడ్డారు.
మమ్మల్ని అడిగితే మా అందరి CV లు ఇచ్చేవాళ్ళము కదా అని అన్నారు ఆకునూరి మురళి. మా ఆఫీస్ టీం లోనే ఆరుగురు పీహెచ్ డీలు చేసిన వాళ్లు, అనుభవం కలిగిన వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తాను ఒక్కడినే ఈ నివేదికను తయారు చేయనని పేర్కొన్నారు. కమిషన్ ఏ ఒక్కరిది కాదని, ఇందులో సభ్యులు కూడా ఉంటారని అన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి కెసిఆర్ కంటే వెయ్యి రెట్లు నయం అన్నారు ఆకునూరి మురళి. నెలకు ఒక రివ్యూ పెడుతున్నాడు, కమిషన్ వేశాడు, VC లను , 10000 కొత్త టీచర్లను అపాయింట్ చేశాడని అన్నారు. కానీ ఏనాడన్నా కేసీఆర్ ఒక్క గంట అయినా విద్యపై సమీక్ష చేపట్టాడా అని నిలదీశాడు.






