ప్రోత్సాహకాలు ఇవ్వక పోతే పెట్టుబడులు ఎలా..?
అమరావతి : వైసీపీ ఎంపీ గురుమూర్తికి బిగ్ షాక్ తగిలింది. తాను దాఖలు చేసిన పిటిషన్ పై మండిపడింద ఏపీ హైకోర్టు. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇది పద్దతి కాదంటూ తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారని ప్రశ్నించింది హైకోర్టు . ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాల పోటీని తట్టుకుని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా అని ప్రశ్నించింది. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్లిపోతాయని వ్యాఖ్యానించింది కోర్టు.
ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు పాలసీలు రూపొందించి ఉండొచ్చని అభిప్రాయ పడింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకునేందుకు తామిక్కడ లేమని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఎక్కువ శాతం తెలుగువారే ఉన్నారని గుర్తు చేసింది హైకోర్టు. ఏపీని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోం దని, ఐటీ హబ్ వల్ల విస్తృత ప్రయోజనాలను భవిష్యత్లో చూడొచ్చు అని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని తెలిపింది.
కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.






