ప్రశంసలు కురిపించిన సూర్య కుమార్ యాదవ్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను టీం ఇండియా కైవసం చేసుకోవడంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కీలకమైన పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇదే క్రమంలో తనను కొన్ని మ్యాచ్ లకు దూరంగా పెట్టడం కావాలని చేసింది కాదన్నాడు. సూర్య భాయ్ జాతీయ మీడియా పీటీఐతో చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో తను రాణించడం విస్తు పోయేలా చేసిందన్నాడు. కానీ తనకు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు సంజు శాంసన్ మీద అపారమైన నమ్మకం ఉందన్నాడు. తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయలేదని కితాబు ఇచ్చాడు.
సంజు శాంసన్ లో ఎక్కడా కించిత్ చూద్దామన్నా గర్వం అనేది కనిపించదని, ఇది ఆటగాళ్లలో చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందన్నాడు. తను గ్రౌండ్ లో ఎలా ఉంటాడో మైదానంలో బయట కూడా అలాగే ఉంటాడని పేర్కొన్నాడు సూర్య కుమార్ యాదవ్. సంజు శాంసన్ గురించి చెప్పాల్సి వస్తే తను గొప్ప ప్రతిభావంతుడు. అద్భుతమైన క్రికెటరర్ అన్నింటికంటే ముఖ్యంగా అతను గొప్ప మానవతావాది. మీరు అన్ని చోట్లా మంచి మనిషిగా ఉంటే, మంచి వారికి మంచే జరుగుతుంది. అతనికి జరిగిన అత్యుత్తమమైన విషయం ఇదేనని నేను అనుకుంటున్నానని అన్నాడు సూర్య భాయ్.






