మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సవిత సెటైర్
శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయన
గత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చెప్పడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. ధర్మవరంలో హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ మోసగించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు తనవంతు కృషి చేశారని మంత్రి సవిత కొనియాడారు.
చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. 90 శాతం సబ్సిడీపై స్టాండ్ లూమ్స్ అందజేస్తున్నామని వెల్లడించారు. ధర్మవరంలో చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఆప్కో షో రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, టీడీపీ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన నాయకులు చిలకం మధుసూదన్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు, చేనేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






