శాసన సభలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసన సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. ఇదే సమయలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల జీవిత బీమాను అందించే లక్ష్యంతో పని చేస్తామన్నారు. ఈ పథకం జూన్ 2 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రవేశ పెడుతోందని ప్రకటించారు.
తెలంగాణలో జన్మించడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా మారే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తగిన సౌకర్యాలను కల్పిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం భద్రతను కల్పిస్తుందన్నారు. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం అనుభవించే మానసిక వేదన ఒక వైపు ఉంటే, వారు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరో వైపు ఉంటుందనన్నారు. ఒక్క దుర్ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ బిడ్డలెవరూ అటువంటి భయం, అభద్రతలతో జీవించ కూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.





