సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు గా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.లక్ష్మయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో స్వయంగా ఒక క్రీడాకారుడైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన హాయాంలో కూడా క్రీడలకు బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. క్రీడాకారులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘాల తరఫున ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి జిల్లాలో క్రీడలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి స్పోర్ట్స్ స్కూల్స్ , స్పోర్ట్స్ హాస్టల్స్, స్పోర్ట్స్ అకాడమీలతో పాటు ఆయా క్రీడాంశాల్లో కోచ్ ల నియామకాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.







