రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డిజిపి హర్షి కుమార్ గుప్తా, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పి రాజబాబు, ఎస్పి హర్షవర్ధన్ రాజు లతో కలిసి ఆమె ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన చెందారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారని, 28 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కొంతమందిని ఒంగోలు గుంటూరుకు తరలించామని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. త్వరలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామన్నారు. కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులకు పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు అని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మార్కాపురం కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి ఎరిక్షన్ బాబు, రవాణా శాఖ జిల్లా అధికారి సుశీల, డిఎస్పి నాగరాజు వీరి వెంట ఉన్నారు.





