Friday, 16 October 2026

ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

newsseals-JupallyKrishnaRao

శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తిపై సీరియ‌స్

హైద‌రాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రయోజనాలను విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేపడుతోందని ఆరోపించారు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మంగ‌ళ‌వారం గాంధీ భవన్‌లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జలాశయంలో నీటిమట్టం కనిష్టంగా 834 అడుగుల (254.2 మీటర్లు) స్థాయికి చేరిన తర్వాత విద్యుత్ ఉత్పత్తిని స్పష్టమైన మార్గదర్శకాలు నిషేధిస్తున్నాయని అన్నారు. ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదని, దీనివల్ల తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలు దెబ్బ తింటున్నాయని ఆయన ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదేపదే విన్నపాలు చేసినా ఫలితాలు రాలేదని, వారి వైఖరి స్పందనా రహితంగా ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకు రావడానికి, కృష్ణా బేసిన్‌లోని రైతులు, నివాసితుల ప్రయోజనాలను కాపాడటానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు శ్రీశైలంలో సామూహికంగా ‘వంట-వార్పు’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని ఆయన అన్నారు. ఈ ఆందోళనలను బలంగా వినిపించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
నీటిలో తన న్యాయమైన వాటా విషయంలో తెలంగాణ రాజీపడదని నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *