నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదన్నారు.
మోడీ మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి నిధులు నిల్ అని పేర్కొన్నారు. అమరావతి లక్ష కోట్ల అప్పులకు లోటు లేదు.. ఆరోగ్యానికి ఇవ్వడానికి చిల్లిగవ్వ లేదంటూ ఎద్దేవా చేశారు. యోగాంధ్ర అని, GST ఉత్సవ సభలని, ఏడాదిలో ప్రధాని విలాసాల కోసమే 12 వందల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబుకి
ఆరోగ్యశ్రీ బకాయిలు 3 వేల కోట్లు ఇవ్వడానికి మనసు రాలేదన్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వ మెరుగైన ప్రజారోగ్యం ? ఇలాగేనా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ? అని నిలదీశారు. వైద్యం అందక ప్రజలను పాడె ఎక్కించడమా స్వర్ణాంధ్ర 2047 విజన్ ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR మానస పుత్రిక అని అన్నారు.
కోట్ల మంది ప్రజలకు ప్రాణాలను నిలిపిన ప్రాణదాత అని గుర్తు చేశారు షర్మిలా రెడ్డి. సంజీవని లాంటి పథకాన్ని నేడు భ్రష్టు పట్టించారని అన్నారు. బకాయిలు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్లలో రెండు సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలవడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. నెలల తరబడి వైద్యసేవలు ఆపడం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు. బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపాలని చూసే కుట్రకు తెర లేపారంటూ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.





