కాలువను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన వైనం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తోంది హైడ్రా. కబ్జాదారులు, భూ అక్రమార్కులకు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్‌లో గజం స్థలం కొనాలంటే రూ. 2 లక్షలు పెట్టాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ సొసైటీకి గతంలో ప్రాతినిధ్యం వహించిన వారు వరద కాలువలున్నా పట్టించు కోకుండా ప్లాట్లుగా సృష్టించారు. 120 గజాల ఓ ప్లాట్, 180 గజాలతో మరో ప్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఓ ప్లాట్ యజమాని ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో పిర్యాదు చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్ ఎంసీ అధికారులతో పాటు సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది.
మాధాపూర్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వరద కాలువతో పాటు.. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వైపు నుంచి వచ్చే మరో వరద కాలువ బాక్స్ డ్రైన్లుగా ఉన్నాయి. బాక్సు డ్రైన్లు ఉంటుండగా.. పైన నిర్మాణాలు చేసేద్దామని ఆలోచనలో ఉన్నట్టు వెల్లడైంది. టిన్ షీట్స్‌తో ప్రహరీలు నిర్మించి.. లోపల వాచ్‌మ్యాన్‌కు గదులు నిర్మించగా.. వాటిని హైడ్రా రంగంలోకి దిగింది. వీటిని తొలగించింది. 300ల గజాల స్థలాన్ని కాపాడడమే కాకుండా.. వరద కాలువలను పరిరక్షించినందుకు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు నగర వాసులు .





