హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాధాపూర్ లోని చెరువులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా పలు సూచనలు చేశారు. సున్నం చెరువు చెంతన ఉన్న బోరబండ బస్తీ, ఎన్ ఆర్ ఆర్ పురం నుంచి వచ్చే వరద నీరు నేరుగా చెరువులోకి కలిసేలా ఇన్‌లెట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. వరద నీరు చెరువులోకి చేరేలా.. మురుగు నీరు కిందకు పోయేలా డైవర్ట్ కాలువ నిర్మాణం కూడా పూర్తయ్యిందని చెప్పారు.
ఇందులో భాగంగా త్వరలో అనుసంధానం చేయాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా కమిషనర్‌కు వివరించారు. అయితే ఈ అనుసంధానం జరగక పోవడంతో సున్నం చెరువు రోడ్డు నుంచి బస్తీలోకి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారిందని స్తానికులు వాపోయారు. ఇక్కడ పైపులైన్లు వేసి మురుగు సాఫీగా సాగేలా చూడాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. సున్నం చెరువును ఆనుకుని వెళ్తున్న హైటెన్షన్ వైర్ల కింద ఆక్రమణలను తొలగించి.. రహదారి విస్తరణపై చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.






