ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్, అమీర్‌పేట తదితర డివిజన్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ పనులు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తమకు ఇవ్వాలని స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. వర్షాకాలం ఇబ్బందులు పడే వారు మీరని, సమస్య ఎక్కడుందో మీకు చాలా స్ఫష్టంగా తెలుస్తుందన్నారు. ఆ సమస్యకు కారణం, పరిష్కారం కూడా మీకు తెలుసు అని పేర్కొన్నారు కమిషనర్ . ఆ సమాచారం అధికారులకు చేరవేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. రహ్మత్‌నగర్ వంతెన వద్ద పెద్దమొత్తంలో పూడికను తీయడాన్ని పరిశీలించారు.
అలాగే కృష్ణానగర్‌లో వేసవి కాలంలోనే మురుగు రహదారులపైకి రావడాన్ని గమనించారు. ప్రతి వంద మీటర్లకూ పూడిక తీత ఎలా జరుగుతుందనేది స్పష్టత ఉండాలని సూచించారు. ఇప్పుడు పూడికను మొత్తం తొలగిస్తే.. వర్షాకాలం వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఉంటుందని చెప్పారు కమిషనర్. ప్రస్తుతం జరుగుతున్న డీ సిల్టింగ్ పనుల్లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా.. కావాల్సిన మిషనరీ అవసరమైనా వెంటనే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే సమకూర్చుతామని చెప్పారు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న జీహెచ్ ఎంసీ, జలమండలి అధికారులకు సూచించారు. డీఆర్ ఎఫ్ సిబ్బంది మీ వెన్నంటే ఉంటారని, పనులకు ఆటంకం కలగకుండా సహకరిస్తారని చెప్పారు.





