ఏపీ పాల‌న‌లో సింగ‌పూర్ మోడ‌ల్ : అచ్చెన్నాయుడు

VijayaBhaskar · April 28, 2026
Spread the love

ముగిసిన ఏపీ మంత్రుల సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న

సింగ‌పూర్ : ఏపీ పాల‌న‌లో సింగ‌పూర్ స‌ర్కార్ త‌ర‌హా మోడ‌ల్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు గత ఏడు రోజులుగా త‌మ‌ మంత్రుల బృందానికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పర్యటనలో చివరి రోజైన ఈరోజు సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పాలనా విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామ‌ని తెలిపారు మంత్రి. “Digital to the Core, and Serves with Heart” అనే నినాదంతో సింగపూర్ ప్రభుత్వం పౌరులకు అందిస్తున్న అత్యంత సురక్షితమైన డిజిటల్ గుర్తింపు కార్డు ‘సింగ్‌పాస్’ (Singpass), అలాగే ప్రజల సమగ్ర వైద్య చరిత్రను వేగంగా పొందేందుకు వీలు కల్పించే ‘హెల్త్‌హబ్’ (HealthHub) యాప్ వంటి అత్యాధునిక సేవల గురించి GovTech నిపుణులు టాన్ ఎంగ్ ఫెంగ్ (Tan Eng Pheng) మాకు వివరించారని తెలిపారు అచ్చెన్నాయుడు.

​సింగపూర్ అనుసరిస్తున్న ఈ స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ సర్వీస్ విధానాలను మన రాష్ట్రంలో ‘స్వర్ణాంధ్ర – 2047’ విజన్‌లో భాగంగా ఏ విధంగా అమలు చేయవచ్చనే అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా మాకు సహకరించిన టాన్ ఎంగ్ ఫెంగ్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపామన్నారు. 7 రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మా మంత్రుల బృందానికి సింగపూర్ కోపరేషన్ ఎంటర్ప్రైజెస్ వారు సర్టిఫికెట్లు అందజేశారన్నారు.. ఇక్కడ పొందిన ఈ అనుభవాలను, అధ్యయనం చేసిన అంశాలను రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని ప్ర‌క‌టించారు.