జనం వైఎస్ జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. 2024 తీర్పు అధికార అహంకారానికి ఒక గుణపాఠంగా మిగిలి పోతుందన్నారు. ప్రజలు ఎన్డీయే కూటమికి కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూడా అప్పగించారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని దామినేడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా “రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి మరియు సంక్షేమం” అనే అంశంపై జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల తీర్పు అధికార అహంకారానికి వ్యతిరేకంగా ఒక చారిత్రాత్మక గుణపాఠమని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమైన వారని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ప్రజా తీర్పు కేవలం ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, అధికారాన్నే సర్వస్వంగా భావించే రాజకీయ సంస్కృతికి వ్యతిరేకంగా వచ్చిన బలమైన సందేశమని నొక్కి చెప్పారు. ప్రజలు కేవలం ఓట్లు వేయరు, వారు చరిత్రను లిఖిస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి విజయం కోసం సహకరించిన ఓటర్లు, రైతులు, పార్టీ కార్యకర్తలు ,నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రజా తీర్పు ప్రజలదేనని, ఏ ఒక్క రాజకీయ పార్టీదో కాదని ఆయన స్పష్టం చేశారు. అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా, బాధ్యతను పంచుకుని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయడానికే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అనుభవం ప్రజల ఆకాంక్షల పట్ల జనసేనకున్న చిత్తశుద్ధి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిని వేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు.