రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ ఫోకస్
ముంబై ఇండియన్స్ తో ఇంటర్నల్ ట్రేడ్
ముంబై : ఐపీఎల్ 2026లో ఆశించిన మేర రాణించ లేదు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. భారీ ధరకు కొనుగోలు చేసిన రిషబ్ పంత్ పూర్తిగా నిరాశ పరిచాడు. దీంతో బ్రాండ్ వాల్యూ పెంచేందుకు గాను మేనేజ్మెంట్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత జట్టుతో పాటు ముంబై ఇండియన్స్ కు వెన్నుముక లాగా ఉంటూ వచ్చిన రోహిత్ శర్మ వైపు ఫోకస్ పెట్టింది లక్నో యాజమాన్యం. ఇందుకు సంబంధించిన ఒక సంభావ్య ట్రేడ్ విషయమై ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రిషబ్ పంత్ ఎల్‌ఎస్‌జిని వీడుతున్నందున, ఆ ఫ్రాంచైజీ జట్టులో ఇకపై ఒక పెద్ద భారతీయ స్టార్ ఉండరు. ఇది వారి బ్రాండ్ విలువను తీవ్రంగా దెబ్బతీయవచ్చు, వారి అభిమానులలో ఒక పెద్ద వర్గం కూడా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. దానిని నివారించడానికి, గోయెంకా ఒక ప్రధాన భారతీయ ఆటగాడిని జట్టులోకి తీసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గోయెంకా రోహిత్‌కు రూ. 200 కోట్ల వరకు ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే ఐదేళ్లపాటు అతనికి కెప్టెన్సీ కాంట్రాక్ట్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. రోహిత్‌ను ఎల్‌ఎస్‌జికి తీసుకు రావడానికి గోయెంకా సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. హార్దిక్ , సూర్యలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికే అభిమానుల మధ్య చర్చలకు దారితీస్తుండగా, రోహిత్ నిష్క్రమణ ముంబై ఇండియన్స్‌కు కూడా ఒక పెద్ద దెబ్బ అవుతుంది. నీతా అంబానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్ ట్రేడ్‌కు అంగీకరించడానికి సిద్ధంగా లేరని సమాచారం.