నా కల నెరవేరిందన్న వైభవ్ సూర్యవంశీ
టీమిండియాకు ఎంపికైన బీహార్ కుర్రాడు
న్యూఢిల్లీ : భారత దేశానికి చెందిన యంగ్ క్రికెటర్ , చిచ్చర పిడుగుగా పేరు పొందిన బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ రంగంలో సంచలనంగా మారాడు. తనకు ఇండియా జట్టు తరపున ఆడాలని ఓ కల ఉండేదన్నాడు. ఆ కల నేటితో నెరవేరిందన్నాడు. ఒకవేళ ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లలో అతను ఆడితే, 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా సూర్యవంశీ నిలుస్తాడు. ఇది సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 16 ఏళ్ల 205 రోజుల రికార్డును అధిగమిస్తుంది. భారత టి20 జట్టుకు ఎంపిక కావడం తన కెరీర్ ఆరంభ దశలో అత్యంత కీలకమైన అడుగు అని, ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున 230కి పైగా స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ 15 ఏళ్ల ఆటగాడు, జూన్ 26న ప్రారంభం కానున్న ఐర్లాండ్ , ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీనిని మాటల్లో చెప్పలేను. మొదటి రోజు బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కోసం మైదానానికి వెళ్లినప్పటి నుండి నేను కన్న కల ఈ రోజు సాకారమైందని చెప్పాడు. బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియోలో సూర్యవంశీ తెలిపాడు. ఈ ప్రయాణంలో అతిపెద్ద అడుగు ఈ రోజు పూర్తయింది. ఈ అనుభూతిని నిజంగా మాటల్లో చెప్పలేను అని అతను జోడించాడు. తన పేరు ముద్రించి ఉన్న భారత జట్టు టీ-షర్ట్‌ను అన్‌బాక్స్ చేసిన క్షణం తనకు ఎంతో ప్రత్యేకమైనదని సూర్యవంశీ తెలిపాడు.