కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్
అమరావతి : ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న మోడల్ ఎడ్యుకేషన్ దేశానికి రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉందన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్ లో పర్యటించి శిక్షణ పొందిన టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు. టీచర్లు మెంటార్స్ గా మారాలన్నారు. మీకు అత్యంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పుడు తొలి అడుగు వేశాం అన్నారు. .అభ్యసన ఫలితాలు, ఎనలిటికల్ థింకింగ్ పై దృష్టి సారించాలని స్పష్టం చేశారు నారా లోకేష్. విద్యా వ్యవస్థలో అన్ని సమస్యలను ఒకేరోజు పరిష్కరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం మీ వెంట ఉంది, విద్యా రంగంలో ఏపీని నెం.1గా తయారు చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ టూర్ ద్వారా ఉపాధ్యాయులు వివిధ అంశాలపై కెపాసిటీ బిల్డింగ్ పై శ్రద్ధ వహించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు. ఇటీవల ఆయన సింగపూర్ వెళ్లి ప్రధాని, ఇతర మంత్రులను కలిసి పలు కొత్త విషయాలపై అధ్యయనం చేశారు, గత కొంత కాలంగా ప్రభుత్వ టీచర్లకు గౌరవం పెరిగింది, మీరు లీడర్లుగా, ఛేంజ్ మేకర్స్ గా తయారుకండి, మీకు అండగా మేముంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్ సీఈఆర్ టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





