టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం

VijayaBhaskar · July 1, 2026
Spread the love

కీల‌క ఆదేశాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇసుక స‌ర‌ఫ‌రా మ‌రింత పార‌దర్శ‌కంగా ఉండేలా చూస్తోంది. ఈ మేర‌కు కీల‌క స‌మీక్ష స‌మావేశం స‌చివాల‌యంలో నిర్వ‌హించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాల, సరఫరా పై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించటంతో పాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. ప్రజల కోసమే ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ సాయి ప్రసాద్, గనుల శాఖ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, పీయుష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.