అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

VijayaBhaskar · July 2, 2026
Spread the love

ద‌శ‌ల వారీగా మిగ‌తా నిధులు జ‌మ చేస్తామ‌న్న స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో విఫలమైన జగన్, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్న ప్రచారం పూర్తిగా నిరాధారం అన్నారు. 2024-25 పంట నష్టాలకు సంబంధించి రూ.580.76 కోట్లలో ఇప్పటికే రూ.324.22 కోట్లు విడుదల చేసి, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం అని వెల్ల‌డించారు. 2025-26 పంట నష్టాలకు రూ.266.414 కోట్లు, 2023 తుఫాన్ ప్రభావిత రైతులకు అదనంగా రూ.48 కోట్లు మంజూరు చేశామ‌ని తెలిపారు.

వైసీపీ హయాంలో జరిగిన లోటును భర్తీ చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసే ముందు, తన ఐదేళ్ల పాలనలో రైతులకు చేసిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14,000, కేంద్ర సాయం 6000తో కలిపి ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తోంద‌ని చెప్పారు. కానీ జగన్ రైతు భరోసా పేరుతో 2019 ఎన్నికల్లో కేంద్ర సాయం లేకుండానే రూ.13,500 ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు కేంద్రం ఇచ్చిన రూ.6,000 కలిపి మాత్రమే రూ.13,500 చెల్లించారని ఆరోపించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేసిన చరిత్ర జగన్‌దేన‌ని పేర్కొన్నారు.