Friday, 16 October 2026

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

newsseals-APSPDCLCMD

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ లోతేటి ఆ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యుత్ సర్వీసులతోపాటు కొన్ని ఇతర కేటగిరీల సర్వీసులకు కూడా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. స్మార్ట్ మీటర్ల పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని సీఎండి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విద్యుత్ బిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం తోపాటు ఆన్లైన్ చెల్లింపులను సరళతరం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులు 100 శాతానికి చేరేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే సందర్భంలో సమాచారాన్ని వినియోగదారులకు ముందుగానే తెలియ జేసేందుకు వీలుగా ‘విద్యుత్ మిత్ర’ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు సీఎండీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *