ఏపీలో వేగవంతంగా పక్కా గృహాల నిర్మాణం
అమరావతి : 2024 తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతం చేసిందని మంత్రి పార్ధసారధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి కేంద్రానికి పంపించి మంజూరు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా 57,600 గృహాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా 684 ఇళ్లు, పీఎం-జనమన్ క్రింద 28,430 ఇళ్లు మొత్తం 86,714 ఇళ్లు మంజూరయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పిఎంఏవై అర్బన్,గ్రామీణ మరియు పియం జన్ మన్ పధకాల కింద 2వేల 102 కోట్ల రూ.లు ఖర్చు చేసి 4లక్షల 56వేల 536 ఇళ్ళను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి ప్రభుత్వం దరఖాస్తులు కోరగా దాదాపు 10,42,199 దరఖాస్తులు అందాయన్నారు .స్క్రూటినీ అనంతరం నిబంధనల మేరకు 9.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు.
వీటిలో మొదటి విడతగా కేంద్రం 74,812 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో అర్హుల సంఖ్యను బట్టి కేంద్రం నుండి పెద్ద సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయిస్తామని హామి ఇచ్చారు. పీఎంఏవై అర్బన్ 2.0 పథకానికి యూనిట్ ధర రూ. 2.50 లక్షలుగా నిర్ధారించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష అందించనుందని వెల్లడించారు. అవసరమైతే ఎస్ హెచ్ జి గ్రూప్ లో సభ్యులైన లబ్ధిదారులు బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. అలాగే అదనంగా స్వచ్ఛ భారత్ మిషన్ నుండి మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించడానికి గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తుందన్నారు. అర్బన్ హౌసింగ్ పథకంలో ఇప్పటి వరకు 5801 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు రూ.178.95 కోట్లు ఖర్చు చేశామన్నారు.
పీఎంఏవై గ్రామీణ పథకంలో భాగంగా యూనిట్ ధర రూ. 2.39 లక్షలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. ఇందులో రూ. 72వేలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.48వేలు అందిస్తున్నాయన్నారు. అంతేకాకుండా రూ.80 వేలు వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కొలుసు పార్థసారథి. ఎన్ఆర్ఈజీఎస్ క్రింద రూ.39 వేలు అందిస్తున్నామన్నారు. స్వర్ణ గ్రామం, వార్డుల్లో పనిచేసే 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు కేటాయించడంతో గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు.