ఏపీలో భూ రికార్డులకు శాశ్వతమైన భద్రత
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తీపి కబురు చెప్పారు. వారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్‌చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ల్యాండ్ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ ఇచ్చి టాంపర్-ప్రూఫ్, సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చెయిన్ వ్యవస్థ రూపకల్పన చేయడం జరిగిందన్నారు సీఎం. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చెయిన్ విధానం అమలులోకి వస్తే ఇక ఇబ్బందులు అంటూ ఉండవన్నారు.
భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ గా ఉండేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు సీఎం. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలను ఒకే వేదిక మీదకు తెచ్చేలా ఇది పని చేస్తుందన్నారు. NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటరాఫ్ ఎక్స్ లైన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థ అభివృద్ధి చేశారన్నారు. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నామన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టామన్నారు. 89 రీ-సర్వే గ్రామాల్లోని 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లు కవర్ చేసేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలట్ ప్రాజెక్ట్ పని చేస్తుందన్నారు సీఎం.