newsseals.com

భూముల ద్వారా ఆదాయం పెంపు ప్ర‌క్రియ‌

July 26, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణలో భూముల ద్వారా ఆదాయం పెంపు ప్రక్రియ వేగవంతం అవుతోంది. జిల్లాల్లోనూ ‘ఉప్పల్ మోడల్’ అమలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్. ఇందుకు సంబంధించిన సమావేశంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూముల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం, భూ సమీకరణ (land pooling) ప్రక్రియలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఉప్పల్ భాగయత్’ తరహా పారదర్శక విధానాలను అనుసరించి, మరిన్ని ప్రాంతాల్లో భూ సమీకరణకు గల అవకాశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి, HMDA పరిధిలోని ప్రభుత్వ భూములను వినియోగించు కోవడంపై అధికారులు రూపొందించిన సమగ్ర ప్రణాళికపై, ఆదాయ సమీకరణకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సుదీర్ఘంగా చర్చించింది.

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి , యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ, తమ జిల్లాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించి, అక్కడ భూ సమీకరణ సాధ్య సాధ్యాలను పరిశీలించాలని సూచించారు. బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చు కోవడంపై దృష్టి సారించాలని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయం వచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల పనితీరుపై భట్టి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా వనరుల సమీకరణ ఉండాలని నొక్కి చెప్పారు.

బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ వనరులను వినియోగించు కోవాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత కాలపరిమితులకు (క్యాలెండర్) కట్టుబడి ఉండాలని, ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

Related News