newsseals.com

పంచాయ‌తీల‌లో ప‌నుల కోసం నిధులు మంజూరు

July 31, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం , ఇతర పనుల కోసం ఎటువంటి ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు అత్యుత్తమ నాణ్యతతో , ఆకర్షణీయమైన డిజైన్లతో ఉండేలా చూడాలని అన్నారు. చీరల రూపకల్పన కోసం నిఫ్ట్ (NIFT) విద్యార్థులను వినియోగించు కోవాలని స్ప‌ష్టం చేశారు. మహిళల నుంచి వస్తున్న మంచి స్పందనను గమనించిన ముఖ్యమంత్రి, నాణ్యత, రంగుల విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని సూచించారు.

ఎల్ నినో నేపథ్యంలో, తాగునీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించాలని ఆయన అన్నారు. తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామీణ తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా 5వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థానిక వనరుల ఆధారంగా తాగునీటి సరఫరా ప్రణాళికలను రూపొందించాలని నిర్దేశించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, పంచాయతీ గణతంత్ర, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్ఈఆర్పీ సీఈఓ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Related News