పాలమూరు జిల్లా : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. స్వంత పార్టీలోనే ఆయన తనదైన స్వరం వినిపిస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, వారి పెత్తనం గురించి ప్రస్తావించారు. షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వివరణ కోరుతామని, ఆయనపై చర్యలు తీసుకునే విషయం ఆలోచిస్తామన్నారు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడారని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. కొందరు తను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం లాంటి వారని ప్రశంసించారు. ఆపై ఆయన మనసులో ఏదీ దాచుకునే వ్యక్తి కాదన్నారు. ఈ రెండేళ్లన్నర కాలంలో ఆయన ఎప్పుడూ మంత్రి పదవిని కోరలేదన్నారు అనిరుధ్ రెడ్డి. ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. పార్టీ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కారమైతే మన పార్టీకి మంచిదని హితవు పలికారు.





