Friday, 16 October 2026

డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు : అచ్చెన్నాయుడు

newsseals-Atchannaidu

అమరావతి : ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైకాపాకు, నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమ‌వారం శాసనమండలిలో డీఎస్సీపై చర్చ సందర్భంగా బొత్స చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి నిరుద్యోగ యువతకు ఒక్క మెగా డీఎస్సీ కూడా ఇవ్వలేక పోయిన బొత్స సత్యనారాయణ ఈరోజు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నీతులు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఐదేళ్లు యువత జీవితాలతో ఆడుకున్న మీరా ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడేది? అని నిలదీశారు. 2019 నుంచి 2024 వరకు వైకాపా అధికారంలో ఉండి మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిందని, ఆ ప్రకటనలను నమ్మి వేలాది మంది యువత అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకుని, ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు చదివారని మంత్రి పేర్కొన్నారు.

చివరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వారి ఆశలను అడియాసలు చేసి, భవిష్యత్తుతో చెలగాట మాడారని మండిపడ్డారు. నాటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బొత్స సత్యనారాయణ ఈ వైఫల్యానికి సమాధానం చెప్పాల‌న్నారు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది చేయకుండా, ఇప్పుడు పెద్దల సభలో నిలబడి డీఎస్సీపై ప్రశ్నలు సంధించడం రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, నిరుద్యోగ యువతకు సకాలంలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడితే దానిని కూడా అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు ఏకంగా 300 కోర్టు కేసులు వేసిన దుర్మార్గపు వైఖరి వైకాపాదేనని మండిపడ్డారు. కోర్టుల చేత చీవాట్లు తిన్నా వైకాపా నేతలకు బుద్ధి రాలేదని, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి, తాము ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తే కోర్టు కేసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించడం నిరుద్యోగ యువత పట్ల వైకాపాకు ఉన్న చిత్తశుద్ధిని బయట పెడుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *