హైదరాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్ల మేడిపల్లి మండలం, చెంగిచెర్ల పరిధిలోని క్రెసెంట్ నగర్‌లో 1200 గజాల విస్తీర్ణం కలిగిన పార్కు స్థలాన్ని హైడ్రా నాడు రక్షించింది. ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. 1989లో ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్ చెంగిచెర్ల గ్రామంలోని సర్వే నంబర్లు 134, 139లలో ‘క్రెసెంట్ నగర్’ పేరుతో 106 ప్లాట్లతో కూడిన గ్రామ పంచాయతీ లేఅవుట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 1200 గజాల స్థలాన్ని పార్కు , ఇతర ప్రజా అవసరాల కోసం కేటాయించారు. కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నందున, ఆ స్థలాన్ని రక్షించాలని ECIL ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజా విచారణలో కోరారు.
సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత, హైడ్రా అధికారులు ఆ స్థలం పార్కుకు చెందినదేనని నిర్ధారించారు. దీనికి అనుగుణంగా ఆ స్థలం పార్కు లేదా ప్రజా అవసరాల కోసం కేటాయించిన రక్షిత ప్రాంతమని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా ఒక బోర్డును ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. పార్కులు, ఖాళీ స్థలాలు , ప్రజా అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి హైడ్రా నిరంతరం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.





