మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి తిరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మంగళవారం కావేరి డెల్టా జిల్లాలో పర్యటించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం జిల్లాలోని మెట్టూరు ఆనకట్ట నుండి ముఖ్యమంత్రి తిరు ఎస్. జోసెఫ్ విజయ్ గారు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పూలు, వరి విత్తనాలను కూడా చల్లారు. అనంతరం ఆయకట్టు ప్రాంత రైతులతో ముచ్చటించారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్ని ఇబ్బందులైనా పడుతుందని , వారిని ఆదుకునే బాధ్యత తమపై ఉందన్నారు.
ప్రతిపక్షాలు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తాయని కానీ టీవీకే కూటమి సర్కార్ అలాంటి వాటిని పట్టించుకోకుండా కామ్ గా తమ పని తాము చేసుకుంటూ పోతుందని పేర్కొన్నారు. తమిళనాడు ప్రాంత రైతాంగానికి ఇబ్బంది కలిగించేందుకు ఎవరు ప్రయత్నం చేసినా వారికి ఇబ్బందులు తప్పవన్నారు. తమ సర్కార్ పూర్తిగా రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు తిరు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. రైతులు ఎవరూ నీళ్లు లేవని ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సమృద్దిగా సాగు కోసం నీళ్లను విడుదల చేయడం జరిగిందని, పొదుపుగా నీటిని వాడు కోవాలని సూచించారు సీఎం విజయ్ చంద్రశేఖర్.