Friday, 16 October 2026

రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి

newsseals-AIGHospitals

విశాఖపట్నం: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్ల‌లో రూ. 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనుంది.

ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్‌ను నెలకొల్పనుంది. మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంద‌ర్బంగా ఏఐజీ చైర్మ‌న్ నాగేశ్వ‌ర్ రెడ్డిని ప్ర‌త్యేకంగా అభినందించారు నారా లోకేష్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *