రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి కీలక ప్రకటన చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11గం||ల నుంచి 12 గం||ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనునట్లు ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్, సోలార్ మీటరింగ్, ఓపెన్ యాక్సెతోపాటు భద్రతా అంశాలకు సంబంధించిన సమస్యలను పారిశ్రామిక వినియోగదారులు చర్చించేందుకు వీలుగా ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనదలచిన పారిశ్రామిక వినియోగదారులు ప్రతి నెలా మొదటి బుధవారానికి 7 రోజుల ముందు నుంచి మొదటి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మొబైల్ నంబరు 8977779471కు కాల్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ సమస్యపై చర్చించి, పరిష్కరించు కునేందుకు అవకాశం వుంటుందని స్పష్టం చేశారు సీఎండీ శివ శంకర్ లోతేటి. ఈ వీడియో కాన్ఫరెన్స్ లింకును సంబంధిత వినియోగదారులకు పంపడం జరిగిందని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకు రావచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.