మైనార్టీల సమస్యలపై మండలిలో గళం వినిపిస్తా
హైదరాబాద్ : రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న . తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి జేఏసీ నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా మల్లన్నను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జామియా నిజామియా వివిధ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని మైనారిటీల సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం, విద్యా, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన పలు అంశాలను మల్లన్న దృష్టికి తీసుకు వచ్చారు. తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు.
అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మైనారిటీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని వర్గాలకు సమాన న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, వక్ఫ్ భూముల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జనాబ్ అబ్దుల్ వహాబ్, రాష్ట్ర కోఆర్డినేటర్ , జేఏసీ కో-కన్వీనర్ జనాబ్ అబ్రార్ హుస్సేన్ ఆజాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జేఏసీ కో-కన్వీనర్ మొహమ్మద్ వసీమ్, వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ ముస్తఫా, ఎస్‌డీపీఐ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మన్సూర్ షా, అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, జేఏసీ సహ-కన్వీనర్ ఖాజా బాబర్ తదితరులు పాల్గొన్నారు.