newsseals.com

సాగు విస్తీర్ణం పెంచేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక

September 9, 2026 · VijayaBhaskar

హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కూరగాయల సాగు, పండ్ల తోటలు, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్తాస్ జనయ్య, పి.వి. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. జ్ఞాన్ ప్రకాష్, ఉద్యానవన విశ్వ విద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రైతుల ఆదాయాలను పెంచేందుకు లాభదాయకమైన కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కూరగాయలు, పండ్ల పంటలు, చిరుధాన్యాలు , ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి అనువైన ప్రాంతాలు, పంటలను గుర్తించి, సమన్వయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక , ఇతర మద్దతును అందించడానికి, అలాగే విలువ గొలుసు , మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేయడానికి నాబార్డ్ , ఇతర సంబంధిత ఏజెన్సీల మద్దతు, సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉన్నందున, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించు కోవడానికి, ముఖ్యంగా ఉద్యానవన , ప్రత్యామ్నాయ పంటలలో, బిందు సేద్యం , ఇతర నీటి పొదుపు నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించడానికి, సుస్థిర , వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, వ్యవసాయ మరియు పశువైద్య విశ్వవిద్యాలయాల మధ్య సన్నిహిత సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Related News