పరిశ్రమలు ఖాళీ స్థలాలను పచ్చని అడవులుగా మార్చాలి
అమరావతి : పర్యావరణ పరిరక్షణ , జీవ వైవిధ్య సంరక్షణ కోసం పరిశ్రమలు తమ హరిత వలయాలను మరింత విస్తరించాలని, స్థానిక జాతుల చెట్లతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు , ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే సుస్థిరమైన హరిత వలయాలను అభివృద్ధి చేయగలమని ఆయన పేర్కొన్నారు. ఆయన కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని డివిస్ లాబొరేటరీస్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న హరిత వలయ అభివృద్ధి , మొక్కల పెంపకం కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి నాగబాబు మాట్లాడారు. పరిశ్రమలు తమ ప్రాంగణంలోని ఖాళీ స్థలాలను ఉపయోగించి హరిత వలయాన్ని మరింత విస్తరించాలని అన్నారు. వేగంగా పెరిగే స్థానిక జాతుల మొక్కలను నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనువైన ప్రతి ప్రదేశంలోనూ మియావాకీ పద్ధతిని ఉపయోగించి దట్టమైన అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు నాగబాబు.
పరిశ్రమలలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ క్రమంగా పచ్చని అడవులుగా మార్చాలని ఆదేశించారు. నాటిన మొక్కల సంరక్షణ , అవి బతికేలా చూడటంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని అన్నారు. అంతకు ముందు నాగబాబు డివిస్ పరిశ్రమ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన హరిత వలయాన్ని , మొక్కలు నాటిన ప్రాంతాలను పరిశీలించారు. భవిష్యత్తులో మరింత పచ్చదనాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమాలు , భవిష్యత్తులో హరిత వలయాన్ని మరింత విస్తరించడానికి రూపొందించిన ప్రణాళికల గురించి పరిశ్రమ ప్రతినిధులు నాగబాబుకు వివరించారు. అనంతరం నాగబాబు డివిస్ లాబొరేటరీస్‌కు చెందిన 100 మందికి పైగా ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చురుకుగా పాల్గొనడాన్ని ఆయన అభినందించారు.