విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం
కృష్ణా జిల్లా : రాష్ట్ర వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలో. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, ఉద్యోగులు , విద్యార్థులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం ఉదయం విజయవాడ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు , ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో, అలాగే దక్షిణ తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాల దెబ్బకు చెన్నై నుండి వచ్చిన ఇండిగో విమానం రాజమండ్రికి మళ్లించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కూడా హెచ్చరించారు. నివేదికల ప్రకారం శనివారం , ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా.