హైదరాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ఏదులాబాద్ చెరువును కాపాడుతామని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. దీనిని కాపాడాలని కోరుతూ పెద్ద ఎత్తున గ్రామస్తులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఇవాళ కమిషనర్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, హైడ్రా అదనపు కమిషనర్ . ఆనంద్ కుమార్‌లతో కలిసి చెరువును సందర్శించారు. అక్కడ గణేష్ నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు , పెద్ద సంఖ్యలో స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కలిసి చెరువు చరిత్రను వివరించారు. కాలుష్యంతో సతమతమవుతున్న ఈ చెరువును కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉండి, ఒకప్పుడు తాగునీరు , సాగునీటిని అందించిన ఈ చెరువు, ప్రస్తుతం కలుషితమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో హైడ్రా అనేక చెరువులను అభివృద్ధి చేస్తుండటంతో పరిసర ప్రాంతాల రూపురేఖలు మారాయని, అదే తరహాలో ఏదులాబాద్ లోని లక్ష్మీనారాయణ చెరువును కూడా అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ చెరువు నీటిని తాకితే చేతులకు జలగలు అంటు కుంటున్నాయని, తీవ్ర కాలుష్యం కారణంగా చేపలు చని పోతున్నాయని వాపోయారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని కలుషిత నీటి ప్రభావంతో బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ , వంధ్యత్వం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుండి వచ్చే వ్యర్థాలు మురుగునీటి ద్వారా చెరువులో కలిసి నీటిని కలుషితం చేస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. మురుగు నీరు చెరువులోకి చేరకుండా కాలువను మళ్లించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చని వారు సూచించారు.





