newsseals.com

బ్రిక్స్ దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు అవ‌స‌రం

September 12, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బ్రిక్స్ ఆర్థిక శక్తి దాదాపు రెట్టింపు వేగంతో విస్తరిస్తోందని పేర్కొన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ,కేవలం నాలుగు దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి, నేడు ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి , ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 21 దేశాల కుటుంబంగా ఎదిగిందని మోదీ అన్నారు. బ్రిక్స్ సాధించిన వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రస్తావిస్తూ, అదే కాలంలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరగగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ దాదాపు 4.5 రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. దీని అర్థం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే బ్రిక్స్ ఆర్థిక శక్తి దాదాపు రెట్టింపు వేగంతో వృద్ధి చెందింది అని ఆయన అన్నారు.

అట్టడుగు స్థాయి కార్యక్రమాల నుండి అత్యాధునిక సాంకేతికతల వరకు అనేక అవకాశాలను సృష్టిస్తూ బ్రిక్స్ దేశాలు ఆవిష్కరణలు , పరిష్కారాలకు ముఖ్యమైన కేంద్రాలుగా ఎదుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సమావేశం ఇప్పటి వరకు జరిగిన వాటిలో అతిపెద్ద బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ అని పేర్కొన్న ప్రధాని, దీని స్థాయి ఈ కూటమిపై పెరుగుతున్న అంచనాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అంతరాయాలు పెరుగుతున్న తరుణంలో, అడ్డంకులను సృష్టించడానికి బదులుగా ఆర్థిక అనుసంధానాలను (ఆర్థిక వారధులు) ఏర్పరచడంపై భారత్ దృష్టి సారించిందని మోదీ చెప్పారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అంతరాయాలు పెరుగుతున్న వేళ, భారత్ ఆర్థిక వారధులను నిర్మిస్తోంది అని పేర్కొన్నారు.

Related News