ఏపీలో 5 వేల దేవాలయాలు నిర్మిస్తాం : సీఎం
తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ , ఈవోలతో సమీక్ష చేపట్టారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను నిర్మించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో ఆనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ వాడలోనూ దేవాలయాలను నిర్మించటం ద్వారా ఆధ్యాత్మికతను పెంపోందించాలని నిర్ణయించాం అన్నారు సీఎం.
భవిష్యత్ తరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను అందించాలన్నది ఆలోచన. రూ.3,165 కోట్ల కార్పస్ అన్నదానం ట్రస్ట్ కింద ఉందన్నారు. అన్న ప్రసాదాన్ని ఇంకా మెరుగ్గా అందించేలా చర్యలు చేపడతాం అన్నారు. ప్రాణదాన ట్రస్ట్ కింద రూ.191 కోట్లు, బర్డ్స్ లో రూ.240 కోట్లు కార్పస్ ట్రస్ట్ కింద ఉందన్నారు. స్విమ్స్ బర్డ్స్, రుయా, చిన్నపిల్లల ఆస్పత్రి ఇలా అన్నిటినీ అనుసంధానం చేస్తామని ప్రకటించారు. వైద్యులను కూడా శ్రీవారి సేవకులుగా మారి ఈ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా చర్యలు చేపడతాం అన్నారు. మానవసేవే మాధవ సేవ అన్న నినాదం కింద రోగులకు సేవలు అందించి శ్రీవారి ఆశీస్సులు పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం. తిరుపతిలో ఉన్న ఆస్పత్రులను అనుసంధానించి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ప్రణాళిక చేస్తాం అన్నారు.