19న 3 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం సెప్టెంబర్ 19న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ అంతటా విస్తృతంగా కురవనున్న వర్షాలలో భాగంగా ఈ హెచ్చరిక జారీ చేయబడింది. అలాగే సెప్టెంబర్ 17 , 18 తేదీలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు , గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
సెప్టెంబర్ 20 , 21 తేదీలలో కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
కర్ణాటక నుండి నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ మార్పులు చోటుచే సుకుంటున్నాయి. ఈ వ్యవస్థ తెలంగాణ , పొరుగు రాష్ట్రాల్లో వర్షాలకు కారణమవుతుందని అంచనా. ప్రభావిత జిల్లాల ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని, భారీ వర్షాలు, ఉరుములు , బలమైన గాలుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది.