ఆకట్టుకున్న రాజస్థాన్ ఘూమర్ నృత్యం
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు వాహనసేవకు మరింత శోభను చేకూర్చాయి. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 21 కళాబృందాల్లో 551 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో తిరుమాడ వీధులను కళా వైభవంతో నింపారు. రాజస్థాన్ ఘూమర్, కర్ణాటక డొల్లు కుణిత, సుగ్గి కుణిత, మహారాష్ట్ర డ్రమ్ విన్యాసాలు, తెలంగాణ బతుకమ్మ, రాస్–గర్భా, ఉత్తరాఖండ్ సంప్రదాయ కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, చెక్కభజన, డప్పు నృత్యం, జాలరి నృత్యం, కోలాటం తదితర కళారూపాలు భక్తులను అలరించాయి.
వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళల సమ్మేళనంతో తిరుమాడ వీధులు కళా వైభవాన్ని సంతరించుకోగా, కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి దివ్య మంగళ దర్శనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళా బృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శాలువతో సన్మానించారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా వివిధ రాష్ట్రాల కళాకారులు అందిస్తున్న ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు .