డబ్బుల పంపిణీపై విచారణ జరిపించాలి : అన్నాడీఎంకే
చెన్నై : అన్నాడీఎంకే సంచలన ఆరోపణలు చేసింది. మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ పేర్కొంది. అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్న మధురాంతకం , ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు పంపిణీ జరిగిందన్న ఆరోపణలపై అత్యవసర విచారణ జరపాలని అన్నాడీఎంకే ఎన్నికల సంఘాన్ని (EC) కోరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ , తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన అధికారిక ఫిర్యాదులో రాజ్యసభ ఎంపీ , అన్నాడీఎంకే న్యాయవాదుల విభాగం కార్యదర్శి ఐ.ఎస్. ఇన్‌బదురై ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆరోపించారు. మధురాంతకం , ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC), ఎన్నికల చట్టాల తీవ్రమైన, విస్తృతమైన ఉల్లంఘనల గురించి మీ దృష్టికి తీసుకు రావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
అచరాపాక్కం యూనియన్‌లోని రెట్టిపాళయంలో టీవీకే (TVK) తరపున అభ్యర్థి మరకతం కుమారవేల్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ జరిగిందన్న సెప్టెంబర్ 22 నాటి మీడియా కథనాలను ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ నిర్దిష్ట ప్రాంతం దాటి మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాల అంతటా ఇలాంటి చట్ట విరుద్ధమైన నగదు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు క్రమబద్ధంగా జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది అని ఆయన ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరపాలని సీసీటీవీ, ప్రసార ఆధారాలను భద్రపరచాలని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, అలాగే ఈ రెండు సున్నితమైన నియోజకవర్గాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్లు , స్థిర నిఘా బృందాల ద్వారా నిఘాను ముమ్మరం చేయాలని ఇన్‌బదురై ఎన్నికల అధికారులను కోరారు.