స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టాలి : జగన్
తాడేపల్లి గూడెం : స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో సమావేశం జరగింది. స్థానిక సంస్థల ఎనికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను వేగంగా గుర్తించాలన్నారు. బలమైన, మంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగ పడాలని పేర్కొన్నారు .పార్టీలో అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థులను జాబితాను తయారు చేయాలన్నారు జగన్ రెడ్డి .పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలని అన్నారు.
స్థానిక నాయకత్వాన్ని ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని ఆదేశించారు పార్టీ బాస్. రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రతి గడప వద్దకూ వెళ్లి మన పాలనలో మంచి, ఈప్రభుత్వంలో వెన్నుపోట్ల గురించి ఏకరువు పెట్టాలన్నారు జగన్ రెడ్డి. ఈ రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను వివరించాలని ఆదేశించారు. పోలీసు బలంతో, అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడి కక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలని పేర్కొన్నారు.