గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తాం : కందుల దుర్గేష్
విజయవాడ : కవి గుర్రం జాశువా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు రాష్ట్ర పర్యాటక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. సోమవారం పద్మభూషణ్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సోమవవారం రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య కళా వేదికలో ఘనంగా పద్మభూషణ్, కవిసామ్రాట్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కందుల దుర్గేష్. సాహితీ వేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు కొమ్మ వరపు, గడ్డం ఈశ్వరమ్మలకు కవిసామ్రాట్ జాషువా సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు మంత్రి దుర్గేష్. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు .తన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన కవి గుర్రం జాషువా అని కొనియాడారు. తమ రచనలతో సామాజిక చైతన్యానికి కృషి చేసిన ఎందరో మహానుభావుల జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు కందుల దుర్గేష్. ఇలాంటి వారి జీవితం పదిమందికి, పదికాలాల పాటు తెలుసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే నంది అవార్డులు కూడా ప్రదానం చేస్తామని ప్రకటించారు.