కేసుల నుంచి తప్పించు కునేందుకే కాలయాపన
మంగళగిరి : వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నీతి అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయ వైఖరి, ఆయనపై ఉన్న కేసులు, దర్యాప్తు సంస్థల విచారణ, కోర్టు వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాస్తవాలను పక్కదారి పట్టించి రాజకీయంగా లబ్ధి పొందడమే జగన్ విధానమని, తనపై ఉన్న కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎదుటి వారిపై నిందలు వేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. బట్ట కాల్చి ఎదుటివారి మీద వేయడం, తనకు సంబంధించిన కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేయడం జగన్ రాజకీయ పద్ధతిగా మారిందని విమర్శించారు. దాదాపు పదిహేను సంవత్సరాలుగా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సుమారు రూ.48 వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ వ్యవహారాలపై 2011లో సీబీఐ విచారణ జరిపి కేసులు నమోదు చేసిందని అన్నారు . అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఆ కేసుల్లో మనీ లాండరింగ్ జరిగిందని, కంపెనీల వాటాల విలువలను పెంచి, షెల్ కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా వచ్చిన డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించు కున్నారనేది ప్రధాన ఆరోపణ అని వివరించారు. తన సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ జగన్ రాజకీయ నాటకాలు ఆడారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. హత్యను చంద్రబాబు నాయుడుకు ఆపాదించేలా అప్పట్లో ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ సాక్షి పత్రికలో కథనాలు ప్రచురించారని, చంద్రబాబు చేతిలో గొడ్డలి ఉన్నట్లుగా చూపిస్తూ రాజకీయ ప్రచారం చేశారని విమర్శించారు. వివేకానందరెడ్డి కుమార్తె, తన చెల్లెలు న్యాయ పోరాటం చేసి సీబీఐ విచారణకు పట్టుబట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. అయినా జగన్ రెడ్డికి బుద్ది రాలేదన్నారు.