newsseals.com

శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో క‌న‌క‌దుర్గ‌

October 12, 2026 · VijayaBhaskar

విజ‌య‌వాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజైన నేడు జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నూతన పూజా మండపంలో వేకువజామున 04:00 నుండి 05:00 గంటల వరకు ప్రత్యేక దేవీ ఖడ్గమాలార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 06:00 గంటలకు మొదటి విడత విశేష కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీ అమ్మ వారి దర్శనం లభిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC), దేవస్థానం సమన్వయంతో వినాయక ఆలయం నుండి క్యూలైన్లలో నిరంతర మంచినీటి సరఫరా, ఉచిత క్లోక్‌రూమ్, పాదరక్షల (చెప్పుల) స్టాండ్లను అందుబాటులో ఉంచారు.

​మహామండపం ప్రాంగణంలో నిరంతర ఉచిత ప్రసాద వితరణ జరుగుతుండగా, కనకదుర్గా నగర్‌లో భక్తులు కోరినన్ని లడ్డూ ప్రసాదాలు అందించేందుకు విస్తృత కౌంటర్లు పని చేస్తున్నాయి. ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తులకు కుమ్మరిపాలెం సెంటర్ నుండి కొండపైకి ఉచిత వాహనాలు ఏర్పాటు చేశారు. పూజ, దర్శనం అనంతరం రథం సెంటర్ ఫుట్ బ్రిడ్జి అవతల (కెనాల్ రోడ్డు వద్ద) నుండి తిరిగి కుమ్మరిపాలెం చేర్చేందుకు వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలు, మైక్ ప్రచారం ద్వారా ఎప్పటికప్పుడు సేవల వివరాలను తెలియ జేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈనెల 14న అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రానున్నారు.

Related News