Monday, 12 October 2026

జర్నలిస్టుల సమస్యల కోసం ప్రెస్ క్లబ్ యాక్ష‌న్ ప్లాన్

newsseals-PressClub

హైదరాబాద్ : జర్నలిస్టులకు మౌలిక వసతులు కల్పించడం, వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమాజిగూడ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు ఎస్.విజయకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టులు, సభ్యులు హాజరయ్యారు. ఏడాది కాలంలో మరణించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు సర్వసభ్య సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ స్థలం లీజు వెంటనే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రెస్ క్లబ్ ఏజీఎం ఏకగ్రీవంగా తీర్మానించింది. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని దీనికోసం అన్ని జర్నలిస్టు సంఘాలను, యూనియన్లను కలుపుకొని కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు కార్యవర్గం తీర్మానం ఆమోదించింది.

అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, వయోధిక పాత్రికేయులకు పెన్షన్లను ఇవ్వాలని ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ప్రెస్ క్లబ్ ఏజీఎం తీర్మానించింది. ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు ఏ.రాజేష్, అరుణ అత్తలూరి, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్ , వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ముత్యాల సత్తిబాబు, ఎం. రమాదేవి, రచన ముడుంబై, వనం.నాగరాజు, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, అమిత్ బట్టు, అశోక్ దయ్యాల, రాజేశ్వరి కల్యాణం, శంకర్ శిగ సర్వసభ సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, ఆర్ .శైలేష్ రెడ్డి, దిలీప్ రెడ్డి, రవి కాంత్ రెడ్డి సహా యూసుఫ్ బాబు తదితరులు హాజరయ్యారు. మరణించిన ప్రెస్ క్లబ్ సభ్యుడి కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం తక్షణం అందజేయాలని ప్రెస్ క్లబ్ సర్వసభ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు నాయకులు దేవులపల్లి అమర్ ను ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలకమండలి శాలువతో సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *